కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ఏర్పడ్డాయి. అరేబియాలో ఏర్పడిన అల్పపీడనంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో సగం భాగం ప్రస్తుతం జలమయమైంది. జూన్‌లో మొదలైన రుతుపవనాలు ఇంకా కొనసాగుతున్నట్లు కొచ్చిన్ వర్సిటీ డైరక్టర్ మోహన్ కుమార్ తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కేరళలో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటికే 29మంది మృతి చెందారు. భారీ సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
సాధారణంగా దక్షిణంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తరం దిశగా పయనిస్తుంది. కానీ ఈసారి దక్షిణంలోనే కేంద్రీకృతం కావడం వల్ల కేరళను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కేరళలో మరో వారం రోజుల పాటు వర్షాలు, బలమైన గాలులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో…. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో మోస్తరు వాన పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది.