నివురుగప్పిన నిప్పులా కేరళ.. కొనసాగుతున్న ఉద్రిక్తత

శనివారం, 5 జనవరి 2019 (12:13 IST)
కేరళ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నివురుగప్పినా నిప్పులా ఉన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించగా, గురువారం రాత్రి శశికళ అనే శ్రీలంక మహిళ ప్రవేశించింది. దీన్ని ధృవీకరిస్తూ కేరళ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను రిలీజ్ చేశారు. అసలే అట్టుడుకిపోతున్న కేరళ రాష్ట్రంలో ఈ సీసీటీవీ ఫుటేజీలు మరింత ఆజ్యాన్ని పోసినట్టయింది. 
 
ఫలితంగా రైట్ వింగ్ నిరసనకారులు పలుచోట్ల విధ్వంసం, దాడులకుపాల్పడుతున్నారు. ఆందోళనకారులు పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున కోళికోడ్ జిల్లా పెరంబ్రాలోని మలబార్ దేవస్థానం మండలి సభ్యుడు కె.శశికుమార్ ఇంటిపై నాటుబాంబులు విసిరారు. పథనంథిట్ట జిల్లా అడూర్‌లో మొబైల్ షాప్‌పైనా పేలుడు పదార్థాలను విసిరారు. 
 
రెండు రోజుల్లో జరిగిన హింసకు సంబంధించి 1,108 కేసులు నమోదు కాగా, 1,718 మందిని అరెస్టు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా 1,009 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆందోళనకారుల హింసాత్మక దాడుల్లో 132 మంది పోలీసులు, 10 మంది జర్నలిస్టులతోపాటు 174 మందికి గాయాలయ్యాయి. మరోవైపు కేరళలోని పాలక్కాడ్, కసర్‌గోడ్ జిల్లా మంజేశ్వరం తాలుకాల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులోకి వచ్చాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు