కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళను రణరంగంగా మార్చింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంస్థల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా శబరిమల కర్మ సమితి ఇచ్చిన 12 గంటల హర్తాళ్ పిలుపు మేరకు వందలాది మంది హిందూ అనుకూల సంస్థల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. అధికార సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులకు కూడా నిరసనల సెగ తాకింది. ఆందోళనకారుల దాడిలో పలువురు పాత్రికేయులు గాయాలపాలయ్యారు.
దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. హర్తాళ్ మద్దతుదారులు హింసకు పాల్పడటం వెనక పక్కా ప్రణాళిక ఉందన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ హింసను ప్రేరేపించాయని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామన్నారు. శబరిమలకు వెళ్లిన ఇద్దరిని ప్రభుత్వం తీసుకెళ్లలేదని, వారు సాధారణ భక్తులలాగే ఆలయ సందర్శనకు వెళ్లారన్నారు. వారిని హెలికాప్టర్‌లో తరలించారన్న వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హర్తాళ్ చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పును శంకించడమేనని అభిప్రాయపడ్డారు. మహిళల దర్శనం తర్వాత ఆలయాన్ని శుద్ధిచేసిన పూజారుల తీరును కూడా విజయన్ తప్పుబట్టారు.