Kodanad Murder and Robbery Case : శశికళ - ఇళవరిసిల వద్ద విచారణ జరపండి : హైకోర్టు

ఠాగూర్

శుక్రవారం, 6 డిశెంబరు 2024 (17:06 IST)
Kodanad Murder and Robbery Case దేశ వ్యాప్తంగా సంచలనంగా రేపిన కొడనాడు హత్య, దోపిడీ కేసులో మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రతిపక్ష అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, శశికళ తదితరులను విచారించేందుకు సీబీసీఐడీ పోలీసులకు అనుమతిచ్చింది. వారిద్దరినీ విచారించకుండా ఊటిలోని జిల్లా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
 
2017లో కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన హత్య, దోపిడీ కేసుపై తొలుత పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు ఐదేళ్లపాటు దర్యాప్తు కొనసాగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేయగా.. సుమారు 100 మందిని విచారించారు. ఈ కేసులో పళనిస్వామి, శశికళను విచారించేందుకు గతంలో దిగువ కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో సీబీసీఐడీ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 
 
తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఎస్టేట్‌లో కనిపించకుండా పోయిన కొన్ని విలువైన వస్తువుల గురించి శశికళ, ఇళవరసిని ప్రశ్నించాలని ఆదేశించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో 2017లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కాపలాదారుడు ఓం బహదూర్‌ను హత్య చేసి, పలు వస్తువులను దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు