సాధారణంగా తమిళులకు మాతృభాషపై ఎనలేని మమకారం ఉంటుంది. ఈ విషయంలో తమిళులను ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే. అయితే, తమిళ మాతృభాషాభిమానం కేవలం తమిళులకే కాదు... మూగ జీవులకు కూడా ఉంటుందని ఓ పులి నిరూపించింది. ఆ పులి పేరు టైగర్ రాముడు. ఈ పులి.. కేవలం తమిళంలో చెపితేనే ఆహారాన్ని ముడుతోంది. లేదంటే అటువైపు కూడా తలెత్తి చూడటం లేదు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ జూ నిర్వాహకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
వాస్తానికి ఈ పులిని చెన్నై, వండలూరులోని అన్నా జంతు ప్రదర్శనశాల నుంచి 2011లో ఉదయ్‌పూర్‌కు తరలించారు. దీనికి టైగర్ రాముడు అనే పేరు పెట్టారు. అయితే, ఉదయ్‌పూర్‌లోని జూలో దామిని అనే ఆడపులి ఉంది. దీనికి మగతోడు కోసం టైగర్ రాముడిని అక్కడకు తరలించారు. అయితే, ఈ జూ నిర్వాహకులకు హిందీ మినహా మరో భాష రాదు.
దీంతో టైగర్ రాముడికి ఆహారం పెట్టి "ఖావో.. పీవో" అంటూ అరుస్తుంటే అది ఆరగించడం లేదు. కానీ, తమిళంలో "సాప్పిడు రామా" అంటూ బిగ్గరగా అరిస్తే చాలు.. ఉరుకులు, పరుగులతో వచ్చి మాంసపు ముక్కలతో పాటు.. ఇతర ఆహార పదార్థాలను పుష్టిగా ఆరగిస్తోంది. ఈ టైగర్ రాముడికి హిందీని అలవాటు వేసినా అది స్పందిచక పోగా, జూ నిర్వాహకులపై గుర్రుమంటుండటం జూ నిర్వాహకులతో పాటు.. సందర్శకులను ఆశ్చర్యపరుస్తోంది.