కేరళ సముద్రతీరంలో లైబీరియా దేశానికి చెందిన కార్గో నౌక ఒకటి నీట మునిగిపోయింది. కొచ్చి తీరానికి సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎస్సీ ఎల్సా-3 అనే పేరు గల ఈ 184 మీటర్ల పొడవైన నౌక తొలుత ఒక వైపునకు ఒరిగిపోయింది. ఈ ఘటనతో సముద్ర జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత తీర రక్షక దళం (ఐసీజీ) ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రమాద సమయంలో నౌకలో ఉన్న సిబ్బందిని సురక్షితంగా కాపాడారు.
నౌక సముద్రంలో మునిగిపోయే సమయంలో కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. తాజాగా, నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయిందని ఐసీజీ అధికారులు వెల్లడించారు. ఈ నౌకలో మొత్తం 640 కంటైనర్లు ఉన్నాయని, వీటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. మరో 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్ ఉందని, మిగిలిన వాటితో పాటు నౌకలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ రసాయనాలు, ఇంధనం సముద్రంలో కలిస్తే తీవ్ర పర్యావరణ నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో కొచ్చి తీరంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
సముద్రంలో తేలియాడుతున్న కంటైనర్లు గానీ, బయటకు వచ్చిన ఇంధనం గానీ తీరం వైపు కొట్టుకువస్తే వాటిని తాకవద్దని 'విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. సముద్ర జలాల్లో ఇంధనం ఎంతమేరకు వ్యాపించిందో తెలుసుకోవడానికి 'ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ'ని ఉపయోగిస్తున్న విమానం నిరంతరం గగనతలంలో పర్యవేక్షిస్తోందని అధికారులు వివరించారు.