కేజ్రీవాల్ లవ్ స్టోరీ ఇదే ... ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక (video)

బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (14:53 IST)
ఢిల్లీలోనే దేశ రాజకీయాలన్నీ కేంద్రీకృతమైవుంటాయి. ఈ హస్తినలోనే దేశ ప్రథమ పౌరుడు మొదలు, దేశ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో పాటు.. దేశ పాలనా యంత్రాంగం అంతా కొలువుదీరివుంటుంది. అలాంటి ఢిల్లీని ఏలాలని ప్రతి ఒక్కరూ కలలుకంటారు. అలాంటి కలను కని సాకారం చేసుకున్న సాధారణ వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఈయన ఓ మాజీ ఐఆర్ఎస్ అధికారి. ఈయనది ప్రేమ వివాహం. ఈ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా.. వారిని ఒప్పించి ఒక్కటయ్యారు. అలాంటి కేజ్రీ లవ్ స్టోరీని ఓసారి తెలుసుకుందాం. 
 
సాధారణంగా, ఒక మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందన్నది నానుడి. ఈ నానుడిని అరవింద్ కేజ్రీవాల్ భాగస్వామి సునీత నిజం చేశారు. కేజ్రీ - సునీతలది ప్రేమ వివాహం. వీరిద్దరూ సివిల్స్ పరీక్ష రాసి ఇండియన్ రెవెన్యూ సర్వీసుకు ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ అకాడెమీలో శిక్షణ పొందారు. 
 
ఆ సమయంలోనే కేజ్రీసునీతలు ప్రేమలోపడ్డారు. ఇద్దరి మనస్తత్వాలు పరస్పరం నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. కానీ, ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. కానీ, పట్టువదలకుండా ఇరు కుటుంబాలను ఒప్పించి 1994లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 
 
కేజ్రీ నిజాయితీ, దేశానికి సేవ చేయాలనే సంకల్పం ఆమెను ఆకట్టుకుంటే, ఆమె తెలివితేటలు, వ్యక్తిత్వం చూసి కేజ్రీ ప్రేమలో పడిపోయారు. కేజ్రీ కుటుంబం హర్యానా రాష్ట్రంలోని హిస్సార్‌లో ఉంటే, సునీత ఫ్యామిలీ ఢిల్లీలో స్థిరపడిన కుటుంబం. వీరికి కుమార్తె హర్షిత, కుమారుడు పులకిత్‌ ఉన్నారు. 
 
అలాంటి అరవింద్ కేజ్రీవాల్ విజయం వెనుక సునీత ఉంది. ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ పయనంలో సునీత అత్యంత కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, ఎన్నికల ప్రచారంలో రాజకీయ దిగ్గజాలకు అందని వ్యూహాలు రచించి, అమలుచేశారు. ఫలితంగా ఢిల్లీలో హ్యాట్రిక్ విజయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుంది. 
 
మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఎన్నికయ్యారు. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను ఏకగ్రీవంగా సీఎల్‌పీ నేతగా ఎన్నుకున్నారు. ఈనెల 16న రామ్‌లీలా మైదానంలో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయనుండటం ఇది వరుసగా మూడోసారి.
 
కేజ్రీవాల్‌తో పాటు మొత్తం కేబినెట్ సభ్యులంతా రామ్‌లీలా గ్రౌండ్స్‌లో ప్రమాణస్వీకారం చేస్తారని, 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా తెలిపారు. కేజ్రీవాల్ పరంగా రామ్‌లీలా గ్రౌండ్స్‌కు ప్రత్యేకత ఉంది. ఇదే మైదానంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. 
 
ఇంతకుముందు రెండు సార్లు కూడా ముఖ్యమంత్రిగా ఇదే గ్రౌండ్స్‌ నుంచి ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారంనాడు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70 స్థానాలకు గాను 62 స్థానాలను ఆప్ గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు ఖాతా తెరవకపోవడమే కాకుండా ఆ పార్టీకి చెందిన 62 మంది అభ్యర్థులు డిపాజిట్ సైతం కోల్పోయారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు