మధ్యప్రదేశ్‌లో వింత - రెండు తలల శిశువు - మూడు చేతులు

గురువారం, 31 మార్చి 2022 (08:45 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లాం జిల్లాలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. రెండు తలల బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ ఇంకో విచిత్రమేమిటంటే.. ఆ రెండు తలల మధ్య చేయి ఉండటం మరో వింత. అంటే మొత్తం మూడు చేతులు ఉన్నాయి. ఆ మహిళ గర్భందాల్చిన సమయంలో నిర్వహించిన సోనోగ్రఫీ స్కానింగ్‌లో కవలలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. 
 
రాట్లాం జిల్లా జావ్రా గ్రామానికి చెందిన షపీన్ అనే మహిళ నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో వెంటనే ఆమెను రాట్లాంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడామెకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. బిడ్డకు రెండు తలలు, మూడు చేతులు ఉండటంతో నిర్ఘాంతపోయారు. 
 
అయితే, మహిళకు అంతకుముందు తీసిన సోనోగ్రఫీ రిపోర్టులో గర్భంలో కవలలు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఆపరేషన్ చేశాక మాత్రం ఒకే శరీరానికి రెండు తలలు, మూడు చేతులు ఉండటం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. తలల మధ్య వెనుక నుంచి మూడో చేయి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. 
 
ప్రస్తుతం ఆ శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో శశివు గర్భంలోనే మరణిస్తుందని, లేదంటే పుట్టిన 48 గంటల్లోనైనా ప్రాణాలు కోల్పోతుందని ఎస్ఎన్‌సీయూ ఇన్‌చార్జి డాక్టర్ నవీద్ ఖురేషీ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు