భారతీయ జనతా పార్టీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్టానం అంటుండగా.. 'బిహార్ ఫార్ములా' ప్రకారం.. ఏక్‌నాథ్ షిండేను కొనసాగించాలని శివసేన పట్టుబడుతోంది. దీంతో పీటముడి పడినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీకి అవకాశం వస్తే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అవుతారా అన్నదానిపై స్పష్టత లేదు. సీఎం రేసులో ముందంజలో ఉన్న ఫడ్నవిస్ పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.
మరోవైపు, ఏక్‌నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన ఎంపీ నరేశ్ మస్కే సోమవారం కోరారు. మిత్రపక్షాలను ఉపయోగించుకుని, చివరకు ఎటువంటి ముఖ్యమైన పదవి ఇవ్వకుండా బీజేపీ... వాటి అడ్డు తొలగించుకుంటుందని ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తుంటాయని, దీనికి చెక్ పెట్టేందుకు షిండే సీఎం కావాలని ఆయన పేర్కొన్నారు. బీహార్ జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా మిత్ర ధర్మాన్ని పాటించి నీతీశ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు, బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ దేరేకర్ మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. ఫడ్నివిస్‌నే ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. రాష్ట్రాన్ని నడిపించే సత్తా ఆయనకే ఉందని స్పష్టం చేశారు. శివసేన ఎంపీ నరేశ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అది పార్టీ వైఖరి కాకపోవచ్చని, అది ఆయన వ్యక్తిగతం కావొచ్చని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎటువంటి ఫార్ములా లేదని, ఆ దిశగా ఎటువంటి చర్చలూ జరగలేదని ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ స్పష్టం చేశారు. మహాయుతి పార్టీలు ఉమ్మడిగా చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. కారాద్లో సోమవారం ఆయన మాట్లాడారు.