మహారాష్ట్రలో లాక్డౌన్‌కు ఛాన్స్ ఇవ్వొద్దు.. మంత్రి ఛగన్‌కు కరోనా

సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (15:23 IST)
మహారాష్ట్రలో ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్నిఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, తన ఆరోగ్యం బాగానే ఉన్నదని, పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నానని చెప్పారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్న నేతలు, మంత్రులు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు. 
 
కాగా, ఛగన్ భుజ్‌బల్‌తో కలిసి ఈ నెల మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బారిన పడిన మంత్రుల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే అనిల్‌ దేశ్‌ముఖ్‌, రాజేంద్ర షింగ్నే, జయంత్‌ పాటిల్‌, రాజేశ్‌ తోపే, సతేజ్ పాటిల్‌, బచ్చు కదూ కరోనా బారినపడ్డారు.
 
మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. యవత్మాల్, చంద్రపూర్, నాందేడ్, జిల్లాలతోపాటు నాగ్‌పూర్, అమరావతి జిల్లాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి జిల్లాలో ఇప్పటికే కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చారు. నాగపూర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు.
 
పరిస్థితులు మళ్లీ తీవ్రంగా మారుతుండటంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆ రాష్ట్ర ప్రజలకు గట్టి హెచ్చరికలు చేశారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే మరోసారి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. వచ్చే రెండు వారాలు కూడా కేసులు ఇలాగే పెరిగితే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుందా లేదా..? అనే విషయం త్వరలోనే స్పష్టమవుతుందని ఉద్దవ్ థాక్రే పేర్కొన్నారు. ఇప్పటికే అమరావతి, అకోలా తదితర ప్రాంతాల్లో పరిస్థితి చేయి దాటి పోయిందని, దాంతో అక్కడ లాక్‌డౌన్‌ విధించామని చెప్పారు. కాగా, మహారాష్ట్రలో ఆదివారం కొత్తగా 6,281 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,93,913కు చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు