కరోనా దెబ్బకు బెంబేలు - ఖైదీలను విడుదల చేయనున్న మహారాష్ట్ర

మంగళవారం, 12 మే 2020 (15:49 IST)
దేశంలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. దేశంలో నమోదైన మొత్తం 72 వేల కేసుల్లో ఈ ఒక్క రాష్ట్రంలోనే 23 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లెక్కలేని విధంగా ఈ కేసులు నమోదవుతున్నాయి. 
 
కరోనా వైరస్ వ్యాప్తికి అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నా వైరస్ దూకుడు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా 23 వేలకు పైగా పాజిటివ్ కేసులు, 868 మరణాలతో మహారాష్ట్ర తల్లడిల్లుతోంది. నిత్యం భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 
కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలాన్ని దృష్టిలో ఉంచుకుని జైళ్లలోని సగం మంది ఖైదీలను విడుదల చేయాలని ఓ అత్యున్నత నిర్ణాయక కమిటీ తీర్మానించింది. జైళ్లలోని 50 శాతం మంది అంటే 35,239 మంది ఖైదీలను మధ్యంతర బెయిలు లేదా పెరోల్ పై బయటికి పంపనున్నారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ సెంట్రల్ జైలులో 184 మంది ఖైదీలు కరోనా బారినపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
కరోనా భయపడి ప్రాణం తీసుకున్న జవాను 
మరోవైపు, కరోనా వైరస్ సోకుతుందన్న భయంతో ఓ సీఆర్ఫీఎఫ్ జవాను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ చర్యతో పారామిలిటరీ వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటన జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జరిగింది.
 
జమ్మూలోని అక్నూర్‌కు చెందిన ఫతేసింగ్ సీఐఎస్ఎఫ్‍‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టరుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, విధి నిర్వహణలో ఉండగా సర్వీస్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం చెందాడు. తీవ్రగాయాలతో పడివున్న ఫతేసింగ్‌ను సహచరులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనంలేకపోయింది. అప్పటికే ఆ ఏఎస్ఐ మరణించాడని డాక్టర్లు చెప్పారు. సూసైడ్ నోట్‌ను పరిశీలించగా, కరోనా భయంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ఈ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు