ఓడిపోతున్న మమతా బెనర్జీ : బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ

శుక్రవారం, 12 మార్చి 2021 (06:12 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ 50 వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోతున్నారంటూ బీజేపీ నేత కాలాశ్ విజయవర్గీయ జోస్యం చెప్పారు. ఓటమి భయం కారణంగానే ఆమె తన సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి నందిగ్రామ్‌కు మారారని, ఆ స్థానంలోకూడా బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో చిత్తుగా ఓడిపోతున్నారంటూ చెప్పుకొచ్చారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఓటమి భయంతోనే ఆమె తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో పోటీ చేయకుండా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ నందిగ్రామ్‌లో కూడా ఆమె కనీసం 50 వేల మెజార్టీతో ఓడిపోతారని జోస్యం చెప్పారు.
 
మమతకు చెందిన టీఎంసీనే గెలవబోతోందంటూ ఒపీనియన్ పోల్స్ అంచనా వేయడాన్ని ఆయన తోసిపుచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీకి కేవలం 8 సీట్లు మాత్రమే వస్తాయని అప్పట్లో చెప్పారని... కానీ, బీజేపీ 18 సీట్లను గెలుచుకుందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే జరగబోతోందన్నారు. లోక్‌సభ ఫలితాల ఆధారంగా లెక్కిస్తే... బీజేపీ 250 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
 
కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలపై యావత్ దేశం దృష్టి సారించింది. బీజేపీ, టీఎంసీలు నువ్వా, నేనా అన్నట్టుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అధికారాన్ని చేపట్టబోయేది తామేనని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే బీజేపీలో చేరిన సువేందు అధికారిపై నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు