బ్లూవేల్‌ ఆడిన తమిళ ఇంజనీర్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

గురువారం, 6 సెప్టెంబరు 2018 (09:29 IST)
బ్లూవేల్‌తో ఆత్మహత్యలు ఆగట్లేదు. ఆన్‌లైన్ మృత్యుక్రీడ 'బ్లూవేల్ గేమ్'పై కేంద్రం నిషేధించింది. ఆత్మహత్యలకు పురికొల్పుతున్న ఈ ఆటను కేంద్రం పరిశీలించి ఈ ఆటను నిషేధించి, సోషల్ సైట్లన్ని సంబందింత లింక్‌ను తీసివేయాలని ఆదేశించింది. అయినా ప్రపంచాన్ని భయపెట్టిన బ్లూవేల్ గేమ్‌కు తమిళనాడుకు చెందిన ఇంజనీర్ బలయ్యాడు. 
 
బ్లూవేల్ ఆడిన తమిళనాడుకు చెందిన ఇంజినీర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని కడలూరు పన్రూట్టిలోని అంగుచెట్టిపాళయానికి చెందిన శేషాద్రి (22) ఇంజినీరింగ్‌ పూర్తి చేసి పుదుచ్చేరి మెట్టుపాళయంలోని ఓ ప్రవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి యథావిధిగా విధులు ముగించుకుని ఇంటికొచ్చిన ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
సమాచారం అందుకున్న పోలీసులు శేషాద్రి ఇంటికి చేరుకుని అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాల కోసం పోలీసులు అతడి గదిని పరిశీలిస్తుండగా దెయ్యాల కథల పుస్తకాలు కనిపించాయి. దీంతో అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా బ్లూవేల్ గేమ్ ఆడినట్టు వెల్లడి అయ్యింది. ఈ గేమ్‌ ఆడటంతో ఏర్పడిన మానసిక ఒత్తిడి కారణంగానే.. శేషాద్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు