మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. గత కొంతకాలంగా వరుసగా ఎదురు దెబ్బలు తింటూ అనేక మందిని కోల్పోతున్న నక్సలైట్లు ఇపుడు ఆయుధాలు వీడి శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ఆగస్టు 15వ తేదీనతో కూడిన ఈ ప్రకటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఇందులో మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని, ప్రజా సమస్యల పరిష్కారానికి గళం విప్పుతామని అందులో పేర్కొన్నారు.
శాంతి చర్చల కోసం నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు. దేశ ప్రధాని ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని నిరంతరం చేసిన అభ్యర్థనల దృష్ట్యా తాము ఆయుధాలను వీడాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఈ అంశాలపై కేంద్ర హోంమంత్రి లేక ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి తాము సిద్ధమని, తమ అభిప్రాయ మార్పు గురించి పార్టీకి తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు.
పార్టీకి ఈ అంశాన్ని వివరించి శాంతి చర్చల్లో పాల్గొనే సహచరులతో ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే, తమ నిర్ణయంపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు వీలుగా మావోయిస్ట్ పార్టీ తొలిసారిగా ఒక ఈమెయిల్, ఫేస్‌బుక్ ఐడీని అందుబాటులోకి తెచ్చింది. ఇది మావోయిస్టు చరిత్రలోనే తొలిసారి ప్రజలతో ప్రత్యక్షంగా కమ్యూనిస్టే చేయడానికి తీసుకున్న చర్యగా భావిస్తున్నారు.