నవ వధువు నగలు, నగదుతో పారిపోయిందని ఫిర్యాదులు వెల్లడైన నేపథ్యంలో, పోలీసులు రహస్య ఆపరేషన్ ప్రారంభించి ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సోమవారం భోపాల్‌లో సవాయి మాధోపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కు చెందిన 23 ఏళ్ల అనురాధ పాస్వాన్ గతంలో ఒక ఆసుపత్రిలో పనిచేశారు. మే 3న సవాయి మాధోపూర్‌కు చెందిన విష్ణు శర్మ చేసిన ఫిర్యాదు మేరకు ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అనురాధతో వివాహం ఏర్పాటు చేయడానికి సునీత, పప్పు మీనా అనే ఇద్దరు ఏజెంట్లకు రూ.2 లక్షలు చెల్లించినట్లు అతను పేర్కొన్నాడు.
విష్ణు శర్మ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఏప్రిల్ 20న స్థానిక కోర్టులో వివాహం చట్టబద్ధంగా జరిగింది. కానీ అనురాధ మే 2న విలువైన బంగారు నగలతో పారిపోయింది. ఈ ఫిర్యాదుతో పోలీసులు కాబోయే వరుడి వేషంలో అనురాధ టీమ్‌ను పట్టుకున్నారు. తదనంతరం, పోలీసు దాడి నిర్వహించి అనురాధను అదుపులోకి తీసుకున్నారు.
ఈ రాకెట్‌లో ప్రమేయం ఉన్న ఇతర అనుమానితులను పోలీసులు గుర్తించారు, వారిలో రోష్ని, రఘుబీర్, గోలు, మజ్‌బూత్ సింగ్ యాదవ్, అర్జున్ ఉన్నారు. ముఠాలోని మిగిలిన సభ్యులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.