ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో బెంగుళూరుకు చెందిన నవీన్ అనే వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. రష్యా సైనిక దళాలు జరిపిన దాడిలో నవీన్ హతమయ్యాడు. ఈ విషాదకర ఘటన ఈ నెల ఒకటో తేదీన ఖర్కివ్ నగరంలో జరిగింది. అప్పటి నుంచి నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి.
ఇవి ఎట్టకేలకు ఫలించడంతో నవీన్ మృతదేహం ఆదివారం బెంగుళూరుకు చేరుకోనుంది. ఈ విషయాన్ని కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ముమ్మరంగా సాగుతున్నందున నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఖర్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో ఫైనల్ ఇయర్ మెడిసిన్ చదువుతూ వచ్చిన నవీన్ ఈ నెల ఒకటో తేదీన రష్యా సంధించిన షెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాల్సిందిగా మృతుని తండ్రి ప్రధాని నరేంద్ర మోడీ, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు లేఖ రాశారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నాయి.