దేశ దీర్ఘకాలిక రక్షణ, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అధికారాలను గవర్నర్‌కు బదలాయిస్తున్నట్లు వెల్లడించారు. కాశ్మీర్‌లో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నించిందన్నారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు చరమగీతం పాడేందుకు ప్రయత్నించామని చెప్పారు. పీడీపీ మాత్రం తన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. జమ్ము-లద్దాక్‌ల అభివృద్ధి విషయంలో పీడీపీ నుంచి భాజపా నేతలకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు.
ఇకపోతే పీడీపీతో ఉన్న సంకీర్ణ బంధాన్ని బీజేపీ తెగతెంపులు చేసుకోవడంతో ముఫ్తీ ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయింది. మరోవైపు మెహబూబా ముఫ్తీ తన సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తమ రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించాలని తాము కోరామని, అలాగే ఎక్కువ కాలం పాటు ఆ పాలన కొనసాగించరాదని చెప్పామని గవర్నర్‌తో భేటీ అనంతరం ఒమర్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.