దినకరన్‌కు 19మంది సపోర్ట్.. స్టాలిన్ చేతులు కలుపుతారా? కొత్త సర్కారు ఏర్పాటు?

మంగళవారం, 29 ఆగస్టు 2017 (11:18 IST)
అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని, దానంతట అదే కూలిపోతుందని తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ అన్నారు. పళని, పన్నీర్‌ వర్గాల విలీనం తరువాత దినకరన్‌కు మద్దతు పెరగిన నేపథఅయంలో తమిళనాడులో అనిశ్చిత పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులలో గవర్నర్ మంచి నిర్ణయం తీసుకుంటారని చూస్తున్నామని స్టాలిన్ వ్యాఖ్యానించారు. 
 
ఇప్పటికే ప్రభుత్వం మైనారిటీలో పడిందని, ఈ మేరకు శాసనసభలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు లేఖ ఇచ్చామని స్టాలిన్‌ తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సీఎం పళనిస్వామిపై తమకు విశ్వాసం లేదని ఆయనను పదవి నుంచి తప్పించాల్సిందిగా శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ తరపు ఎమ్మెల్యేలు గవర్నరు విద్యాసాగర్‌ రావును కలిసిన విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో భాజపా ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి చేసిన ట్వీట్‌ ప్రస్తుతం మరింత ఉత్కంఠను రేపుతోంది.
 
తమిళనాడు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ప్రతిపక్ష డీఎంకే పార్టీ నేత ఎంకే స్టాలిన్‌, టీటీవీ దినకరన్‌ చేతులు కలిపి మరికొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్వామి ట్వీట్ చేశారు. స్టాలిన్‌, దినకరన్‌ మద్దతుదారులతో పాటు మరికొందరు గవర్నర్‌తో సమావేశం కావడం ఈ వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
 
అన్నాడీఎంకే చీలిక వర్గాలు ఇటీవల విలీనమవడంతో దినకరన్‌ తరపు ఎమ్మెల్యేలు అడ్డం తిరిగారు. తామంతా దినకరన్‌ వైపే ఉంటామని దాదాపు 19 మంది ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం పళనిస్వామి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో పళని ప్రభుత్వం మైనారిటీలో పడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు