తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి సర్కారుకి తమ మద్దతు ఉపసంహరిస్తున్నట్లు దినకరన్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుకు తెలిపారు. మంగళవారం నాడు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఈ మేరకు వారు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. దీనితో అసెంబ్లీలో పళని స్వామిని తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ కోరే అవకాశాలున్నాయి.
కాగా అంతకంటే ముందే పార్టీ కమిటీకి కన్వీనర్‌గా సారథ్యం వహిస్తున్న పన్నీర్ సెల్వం వారిపై అనర్హత వేటు వేసే అవకాశం వున్నదని అంటున్నారు. గతంలో కర్నాటకలో యడ్యూరప్ప కూడా ఇలాంటి ఫార్ములానే అనుసరించారు. తనకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సమాయత్తమైన 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి అసెంబ్లీ బల నిరూపణలో నెగ్గుకొచ్చారు. మరి ఇప్పుడు అదే ఫార్ములాను పళని స్వామి కూడా పాటిస్తారనే చర్చ నడుస్తోంది.