ముందుగానే నిష్క్రమించిన రుతుపవనాలు - ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

ఠాగూర్

సోమవారం, 15 సెప్టెంబరు 2025 (15:28 IST)
ఈ యేడాది నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే నిష్క్రమించినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఈ యేడాది దేశానికి సమృద్ధిగా వర్షాలను అందించిన ఈ నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే మూడు రోజుల ముందే వెళ్లిపోయాయని తెలిపింది. సాధారణంగా ఈ యేడాది సెప్టెంబరు 17వ తేదీ వరకు నైరుతి రుతపవనాలు కొనసాగాల్సి వుంది. కానీ, ఈ ప్రక్రియ మూడు రోజుల ముందుగానే మొదలు కావడం గమనార్హమని తెలిపింది. 
 
ఈ రుతుపవన సీజన్‌లో దేశ వ్యాప్తంగా అంచనాలకు మించి వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 14వ తేదీ మధ్యకాలంలో సాధారణంగా 790.1 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సివుండగా, ఈ యేడాది ఇది 846.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది సాధారణం కంటే ఏడు శాతం అధికమని వెల్లడించారు. 
 
ఒకవైపు, రుతుపవనాలు వెనుదిరుగుతుండగా, మరోవైపు, బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాతావరణ నమూనాల అంచనాల ప్రకారం  ఈ ఆవర్తనం ఈ నెల 20వ తేదీ నాటికీ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అయితే, అది ఆ తర్వాత మరింత బలపడుతుందా లేదా అనే విషయంపై ఇపుడే స్పష్టత ఇవ్వలేమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు