భర్తపై అలిగి మేనమాన ఇంటికెళ్లిన మహిళ... చెట్టుకు వేలాడదీసి కర్రలతో కొట్టారు..

ఆదివారం, 4 జులై 2021 (15:24 IST)
బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఓ దారుణం జరిగింది. భర్తపై అలిగి మేనమామ ఇంటికి వెళ్లిన ఓ మహిళను ఆమె తండ్రి, సోదరులే అత్యంత దారుణంగా అవమానించారు. అందరూ చూస్తుండగా ఘోరంగా శిక్షించారు. ఆమెను చితకబాదారు. తాళ్లతో చెట్టుకు వేలాడదీసి చావబాదారు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలోని అలిరాజా‌పూర్ అనే ఓ గిరిజన గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మూడు నెలల క్రితం పెండ్లి చేసుకున్న 19 ఏళ్ల వధువు భర్తపై అలిగి పుట్టింటికి వచ్చేసింది. అక్కడ నుంచి తన మేనమామ ఊరికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఆమెను ఘోరంగా శిక్షించారు. 
 
మేనమామ ఇంట్లో నుంచి జట్టు పట్టుకుని బైటకు లాక్కొచ్చారు. ఆమెను కింద పడేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి చెట్టుకు కట్టేశారు. అనంతరం కర్రలతో ఆమెను కొట్టారు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ ఘటన గురించి దర్యాఫ్తు చేసి ఆ మహిళ తండ్రి, సోదరులను అరెస్ట్ చేశారు. 
 
దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దాడి ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు