ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు తొలుత ప్రకటించారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. అనంతరం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగింది. ఫలితంగా ఆర్‌ఎల్‌డీ ఇప్పుడు ఒంటరిగా పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీనిపై ఆర్ఎల్‌డి ప్రధాన కార్యదర్శి జయంత్ చౌదరి స్పందిస్తూ ఎస్పీ, కాంగ్రెస్ కూటమిలో చేరాలని తామేమీ ఉవ్విళ్లూరలేదన్నారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం ఫోన్ చేసి కంటతడి పెట్టడంతో తాము పొత్తుకు అంగీకరించామని చెప్పుకొచ్చారు. ఆ కూటమిలో చేరనంత మాత్రాన తమ పార్టీ బలహీనమైపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
'మీ స్నేహితుడెవరైనా ఫోన్ చేసి ఏడ్చి, సాయం కోసం అభ్యర్థిస్తే.. చేయడం మానేస్తారా? అలానే ములాయం ఫోన్ చేసి పొత్తు పెట్టుకోవాలని కోరడంతో రెండు నిమిషాల్లో పొత్తు నిర్ణయం తీసుకున్నాం' అని చెప్పారు. అంతే తప్ప కావాలని తామేమీ పొత్తుకు ముందుకు రాలేదన్నారు. తమ పార్టీ ఇప్పుడు మరింత బలంగా తయారైందని చెప్పారు. అనంతరం అఖిలేశ్‌పైనా వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించారు.