రోగాన్ని ఇతరులకు అంటించడం ఖురాన్ ప్రకారం పాపం : 'మాజీ'ల బహిరంగ లేఖ

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (09:07 IST)
9దేశంలో ఉన్న ముస్లిం ప్రజలకు అదే  సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్ అధికారులు ఓ బహిరంగ లేఖ రాశారు. ఖురాన్ ప్రకారం.. ఏదేని ఒక రోగాన్ని ఇతరలకు అంటించడం పాపమని వారు గుర్తుచేశారు. అందువల్ల కరోనాపై జరుగుతున్న పోరాటానికి మనవంతుగా కృషి చేసి నిజమైన భారతీయులం అనిపించుకుందామని వారు ముస్లిం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు తాజాగా ఓ లేఖను విడుదల చేశారు. 
 
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన మత సమ్మేళనమే కారణమని, ఈ మత ప్రార్థలనకు వెళ్లిన ముస్లిం ప్రతినిధుల వల్లే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిచెందిందని తేటతెల్లమైంది. పైగా, ఈ ప్రార్థనల తర్వాత బయటకు వచ్చిన వారు భౌతిక సామాజిక దూరాన్ని పాటించడం లేదనీ, వైద్య పరీక్షలు చేసేందుకు వచ్చే వైద్య సిబ్బంది, పోలీసులపై భౌతికదాడులకు దిగుతున్నారు. ఈ సంఘటనలతో ముస్లిం ప్రజలపై దేశంలో తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఓ లేఖ రాశారు. ముస్లిం సోదరులంతా భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసిన వారు, ముస్లిం సమాజానికి బహిరంగ లేఖను రాశారు. 
 
'తమను పరీక్షించేందుకు వచ్చిన హెల్త్ వర్కర్లపై దాడులు చేయడం, పోలీసులపై దాడులు వంటి చట్ట వ్యతిరేకమైన చర్యలు కూడదు. ఇవి అశాంతిని పెంచుతాయి. మసీదుల్లోకి పెద్ద సంఖ్యలో వెళ్లవద్దు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, కరోనాపై పోరాటంలో స్ఫూర్తి నిచ్చే భారతీయులుగా నిలవాలి' అని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. 
 
ఈ సందర్భంగా ఖురాన్ లోని కొన్ని అంశాలను వారు ప్రస్తావించారు. ఏదైనా రోగాన్ని ఇతరులకు అంటించడం ఖురాన్ ప్రకారం, పాపమని వారు గుర్తు చేశారు. నిర్లక్ష్యంగా ఉండటం కూడా నేరమేనని, వైరస్ లక్షణాలు కనిపించగానే, వైద్యులను సంప్రదించాలని సూచించారు.
 
ఈ వైరస్ కేవలం మానవ శరీరంలో దాగి, ఒక్కరికి మాత్రమే పరిమితం కాదని, అతని మతిలేని చర్యల కారణంగా ఇతరులకు వ్యాపిస్తుందని, వైరస్ సోకిన వ్యక్తి నుంచి తొలుత కుటుంబ సభ్యులకు, ఆపై, సమాజంలోని ఇతరులకు, వారి నుంచి వందల, వేల మందికి సోకుతుందని, దీని కారణంగా లెక్కలేనన్ని మరణాలు సంభవిస్తాయని వీరు తమ లేఖలో హెచ్చరించారు. 
 
ఈ క్లిష్ట పరిస్థితుల్లో ముస్లింలంతా బాధ్యతగల పౌరులుగా వ్యవహరించాలని కోరారు. ఓఅమాయక ప్రాణాన్ని బలిగొంటే, అది మొత్తం మానవాళిని హతమార్చినంత పాపమని, అదే ఓ ప్రాణాన్ని కాపాడితే, మానవాళిని రక్షించినంత పుణ్యమని ఖురాన్ చెబుతోందని వారు గుర్తుచేశారు. ఒకసారి కరోనా అంతరించిన తర్వాత, ముస్లిం సమాజమంతా మసీదుల్లో సామూహిక ప్రార్థనలకు పెద్దఎత్తున హాజరు కావచ్చని, అంతవరకూ మాత్రం ఇళ్లకే పరిమితంకావాలని వారు సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు