ఆఫర్ వద్దంటున్న అసదుద్దీన్... అభ్యంతరాలున్నాయన్న ముస్లిం బోర్డు

శనివారం, 9 నవంబరు 2019 (15:16 IST)
ఈ తుదితీర్పుపై ముస్లిం పర్సనల్‌ లాబోర్డు స్పందించింది. వివాదాస్పద భూమిని రామ్‌జన్మభూమి న్యాస్‌కు అప్పగించడంపై లాబోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు ఆమోదయోగ్యం కాని విషయాలు చాలా ఉన్నాయని తెలిపింది. న్యాయస్థానం పేర్కొన్నట్లు పదిహేనో శతాబ్దానికి ముందు ఆధారాలు ఉంటే ఆ తర్వాత కాలానికి చెందిన చారిత్రక ఆధారాలు కూడా ఉంటాయి కదా? అని ప్రశ్నించింది.
 
కోర్టు తీర్పును గౌరవిస్తామని, కానీ తమ అభ్యంతరాలను కూడా మరోసారి పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపింది. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, చర్చ జరిగిన అనంతరం న్యాయపరంగా ఎలాంటి అడుగు వేయాలన్నది నిర్ణయిస్తామని తెలిపారు. 
 
మరోవైపు, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ తీర్పుపై స్పందించారు. ఈ తీర్పు పట్ల తాను సంతృప్తి వ్యక్తం చేసే స్థితిలో లేనని అన్నారు. సుప్రీంకోర్టు నిజంగా అత్యున్నతమైనదేనని, అయితే, పొరపాటుపడనిది కాదని వ్యాఖ్యానించారు. తమకు రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉందని, తాము తమ హక్కులపై పోరాటం చేశామని చెప్పారు. విరాళంగా తమకు ఐదు ఎకరాల భూమి అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ భూమిని తాము తిరస్కరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
 
ఈ తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిగా ఉందని ఒవైసీ తెలిపారు. తాము 5 ఎకరాల భూమి కోసం కాదు, న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రివ్యూ పిటిషన్ వేయాలా? అనే విషయాన్ని పర్సనల్ లా బోర్డు నిర్ణయిస్తుందని అన్నారు. తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటనను సమర్థిస్తున్నానని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు