వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. ముఖ్యంగా వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఎటువంటి టీవీ డిబేట్లలో పాల్గొనవద్దని విపక్ష కాంగ్రెస్ పార్టీతోపాటు అధికార బీజేపీ కూడా తమ అధికార ప్రతినిధులు, నాయకులను ఆదేశించింది.
కోర్టు తీర్పుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని, టీవీ డిబేట్లకు హాజరు కావద్దంటూ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ సున్నితమైన వ్యవహారంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్యూసీ) సమావేశంలో కూలంకుషంగా చర్చించిన అనంతరం పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తామని ఆయన తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
అలాగే, భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు ఇటువంటి ఆదేశాలే జారీ చేసింది. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ వ్యవహారంపై ఆచితూచి మాట్లాడాలని ఆ పార్టీ నిర్ణయించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన స్వగృహంలో పార్టీ అధికార ప్రతినిధులతో సమావేశమై ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.