కరూర్‌లో జరిగిన తొక్కిసలాటపై టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ స్పందించారు. నా గుండె పగిలిపోయిందని, మాటలకు అందని, వర్ణించలేని బాధతో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన సోదరీసోదరమణులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు.
కాగా, ప్రముఖ కోలీవుడ్ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన శనివారం సాయంత్రం కరూర్ పట్టణంలో జరిగింది.
టీవీకే పార్టీ తరపున విజయ్ రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా కరూర్‌లో ఏర్పాటు చేసిన సభకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విజయ్ వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణంలోని ఇరుకైన ప్రాంతంలో ఒక్కసారిగా జనం ముందుకు తోసుకురావడంతో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఈ క్రమంలో జనం ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడక, కిందపడి నలిగిపోయి 36 మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు చిన్నారులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన తర్వాత విజయ్ నేరుగా చెన్నైకు వచ్చారు. ఈ ఘటనపై నటుడు విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. 'నా గుండె పగిలిపోయింది. మాటలకు అందని, వర్ణించలేని బాధతో కుమిలిపోతున్నాను. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా సోదర సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని ఆయన 'ఎక్స్' (ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
మరోవైపు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయడానికి న్యాయ విచారణకు ఆదేశించారు.