కరూర్ తొక్కిసలాట ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు ... సీఎం స్టాలిన్ హెచ్చరిక

ఠాగూర్

ఆదివారం, 28 సెప్టెంబరు 2025 (09:19 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గట్టి హెచ్చరిక చేశారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 
 
సినీ హీరో, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో విచారణ కమిషన్‌ను నియమించింది. ఈ విచారణ అనంతరం ఘటన వెనుక నిజానిజాలు బయటపడతాయని సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్టాలిన్‌ పరామర్శించారు.
 
అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. 'కరూర్‌లో జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటివరకు 39 మంది ప్రాణాలో కోల్పోయారు. రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంతమంది ప్రజలు మరణించడం ఇదే తొలిసారి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు. ప్రస్తుతం 51 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.లక్ష పరిహారం అందిస్తాం' అని స్టాలిన్‌ పేర్కొన్నారు.
 
ఈ ఘటనపై విచారణకు రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్‌ను నియమించినట్లు స్టాలిన్‌ తెలిపారు. విచారణ అనంతరం నిజానిజాలు బయటపడతాయన్నారు. రాజకీయ ఉద్దేశంతో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. విచారణలో నిజాలు బయటకు వచ్చాక.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు