21వ శతాబ్ది భారత్‌దే... కరోనాపై పోరాటం తప్పదు.. ప్రధాని మోడీ పిలుపు

మంగళవారం, 12 మే 2020 (20:56 IST)
21వ శతాబ్ది భారత్‌దే అని, అయితే కరోనా వైరస్‌పై పోరాటం తప్పదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన మంగళవారం రాత్రి 8 గంటలకు మరోమారు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మ్ నిర్భర్ భారత్ పేరుతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దేశ జీడీపీ 10 శాతాన్ని ఈ ప్యాకేజీకి కేటాయించినట్టు తెలిపారు. పైగా, ఈ నిధులతో ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని తెలిపారు.
 
అంతేకాకుండా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‍పై యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు. ఓవైపు మహమ్మారితో యుద్ధం, మరోవైపు అభివృద్ధి కోసం పోరాటం చేయాల్సిందేని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ బాధ్యతను 130 కోట్ల మంది తలకెత్తుకోవాలని విజ్ఞప్తిచేశారు. 
 
ఈ నెల 17వ తేదీతో మూడో దశ లాక్డౌన్ ముగియనుండగా, మే 18 నుంచి లాక్డౌన్‌కు కొత్త రూపు రానుందని చెప్పారు. లాక్డౌన్-4లో కూడా అన్ని నియమాలు, జాగ్రత్తలు పాటిద్దామని ఆయన పిలుపునిచ్చారు. 
 
అంతేకాుండా, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ కరోనాను కూడా ధీటుగా ఎదుర్కొంటోందన్నారు. ప్రస్తుతం నెలకొన్న విపత్కర సమయంలో భారత్ సామర్థ్యాన్ని తక్కిన ప్రపంచం కూడా నమ్ముతోందని, భారత ఔషధాలు ప్రపంచానికి వరంగా మారుతున్నాయన్నారు. 
 
ప్రపంచానికి భారత్ యోగాను కానుకగా ఇచ్చిందని, నాడు 2000 సంవత్సరంలో వై2కే సమస్య ఉత్పన్నమైతే యావత్ కంప్యూటర్ ప్రపంచం తల్లడిల్లిపోయిన వేళ భారత నిపుణులు నిబ్బరంగా సమస్యను ఎదుర్కొన్నారని, ప్రపంచానికి దిశా నిర్దేశం చేశారని ప్రధాని మోడీ గుర్తుచేశారు. 
 
అదేసమయంలో ప్రస్తుతం చాలా కీలక దశలో ఉన్నామని, స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా నివారణ మార్గమన్నారు. ఇలాంటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదని, అయితే ఈ మహమ్మారిపై పోరాటంలో ఓడిపోవడానికి మనిషి సిద్ధంగా లేడని అన్నారు. 
 
కరోనా వైరస్ ఓ సందేశాన్ని తీసుకువచ్చిందని, బతకాలి, బతికించుకుంటూ ముందుకు సాగాలన్నదే ఆ సందేశం అని, ఓటమిని ఎన్నటికీ స్వీకరించరాదన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు