ఇటీవల ఢిల్లీలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఆందోళన సాగింది. ఈ ఆందోళనల్లో హింస చెలరేగింది. ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా ఓ కానిస్టేబుల్ కూడా చనిపోయినట్టు అయితే ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఓ ట్వీట్ చేశారు.
పైగా, పోలీసులకు, ఆందోళనకారులకు జరిగిన ఘర్షణపూరిత వాతావరణంలో ఓ వ్యక్తి మరణించిన విషయంపై ఆయన ట్వీట్ చేశారు. పోలీసు కాల్పుల్లోనే నవనీత్ (45) మృతి చెందాడని, ఆయన త్యాగం వృథాగా పోనివ్వమని రైతులు తనతో చెప్పారని రాజ్‌దీప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్ అయింది,.
ఆ తర్వాత దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఈ వార్తను ఖండించారు. ట్రాక్టర్ బోల్తాపడటంతో నవనీత్ మృతి చెందారని స్పష్టం చేస్తూ, ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. అంతేగాక, ట్రాక్టర్ పల్టీ కొట్టి తల పగలడంతోనే ఆయన ప్రాణాలు కోల్పోయారని పోస్ట్‌మార్టం నివేదిక కూడా స్పష్టం చేసింది.
దీంతో ఆయన బాధ్యతారాహిత్యంగా ట్వీట్లు చేశారంటూ ఇండియా టుడే గ్రూప్ ఆయనపై రెండు వారాల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. అంతేగాక, నెల వేతనం కోత విధించినట్లు తెలుస్తోంది. దేశంలోనే మంచి పేరున్న సీనియర్ జర్నలిస్టుగా రాజ్‌దీప్‌కు గుర్తింపువుంది.
కాగా, తప్పుడు వార్తలను ట్వీట్ చేస్తున్న రాజ్‌దీప్ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వార్త ఇపుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది. దీనిపై ట్విట్టర్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.