75 యేళ్ళ రిటైర్మెంట్‌పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యూటర్న్ తీసుకున్నారు. తూచ్.. రాజకీయాల్లో, సంస్థల్లో 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని తాను వ్యాఖ్యానించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
తాను గానీ, మరే ఇతర రాజకీయ నాయకులు గానీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని ఎన్నడూ చెప్పలేదని ఆయన తేల్చి చెప్పారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ 75వ యేట అడుగుపెడుతున్న నేపథ్యంలో, గతంలో భగవత్ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించినవేనని జరుగుతున్న ప్రచారానికి ఈ ప్రకటనతో తెరపడింది.
గురువారం ఢిల్లీలో జరిగిన "100 వర్ష్ కీ సంఘ్ యాత్ర" కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ, "నేను రిటైర్ అవుతాననిగానీ, ఇంకెవరైనా రిటైర్ అవ్వాలనిగానీ ఎప్పుడూ చెప్పలేదు" అని స్పష్టం చేశారు. గతంలో తాను ఆర్ఎస్ఎస్ మాజీ నేత మోరోపంత్ పింగళికి సంబంధించిన ఒక చమత్కారమైన సంఘటనను ఉదాహరించానని, దానిని చాలామంది తప్పుగా అన్వయించుకున్నారని వివరించారు.
నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పింగళి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయనకు సంబంధించిన మూడు, నాలుగు సరదా సంఘటనలను పంచుకున్నానని గుర్తుచేశారు. "మోరోపంత్ చాలా చమత్కారి. ఆయన మాటలతో కుర్చీలోంచి ఎగిరి గంతేసేలా చేసేవారు," అని భగవత్ అన్నారు. పింగళికి 75 ఏళ్లు వచ్చినప్పుడు, మరో సీనియర్ నేత హెచ్.వి.శేషాద్రి ఆయనకు శాలువా కప్పి ఇక బాధ్యతల నుంచి తప్పుకోవాలని సున్నితంగా సూచించిన సంఘటనను తాను సరదాగా చెప్పానని, అంతేకానీ దానిని ఒక నిబంధనగా పరిగణించరాదని ఆయన తెలిపారు.