ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు ఎన్.ఐ.ఏకు అప్పగింత

గురువారం, 7 అక్టోబరు 2021 (09:39 IST)
గుజరాత్‌ ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ.21వేల కోట్ల విలువైన 2,988 కిలోల మాదక ద్రవ్యాల కేసులోని లోగుట్టును నిగ్గు తేల్చేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) రంగంలోకిదిగింది. ఈ కేసును ఎన్‌ఐఏకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బదిలీ చేయగా.. డీఆర్‌ఐ నుంచి కేసును స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించింది. 
 
ముంద్రా పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసుకు లింకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో కూడా వెలుగు చూసిన విషయం తెల్సిందే. దీంతో ఈ కేసును కేంద్ర హోం శాఖ పూర్తి స్థాయి విచారణకు ఎన్ఐఏకు అప్పగించింది. ముఖ్యంగా, ఈ డ్రగ్స్ కేసులో విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అందుకే కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి మాదక ద్రవ్యాల రవాణాపై విచారణ జరుపనుంది.
 
ఆఫ్ఘన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు ‘సెమీ ప్రాసెస్డ్‌ టాల్క్‌ స్టోన్‌’గా రవాణా చేసిన విషయం తెలిసిందే. రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ (డీఆర్‌ఐ) సెప్టెంబర్‌ కచ్‌ జిల్లాలోని ముంద్రా పోర్టులో రెండు కంటైనర్ల నుంచి 2,988.21 కిలోల హెరాయిన్‌ను ఢిల్లీకి తరలించేందుకు యత్నిస్తుండగా స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఐదుగురు విదేశీ పౌరులతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
 
పట్టుకున్న డ్రగ్స్‌ చిరునామా ఏపీలోని విజయవాడ ఆషీ ట్రేడింగ్‌ పేరిట ఉంది. తూర్పుగోదావరికి చెందిన వ్యక్తి ఇందులో ప్రాతధారిగా ఉన్నాడని విచారణ సంస్థలు గుర్తించారు. తన భార్య పేరిట కంపెనీని రిజిష్టర్‌ చేయించి, దాన్ని మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలకు అందజేశాడని విచారణ సంస్థలు తేల్చాయి. గతేడాది సైతం దాదాపు 25 వేల టన్నుల హెరాయిన్‌ ఆఫ్ఘన్‌ నుంచి కాకినాడ పోర్టు ద్వారా ఢిల్లీ సహా దేశంలోని పలు ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు