నిర్భయ కేసులో ముద్దాయిలుగా ఉన్న నలుగురు నిందితుల్లో ఇద్దరు దోషులు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. దీంతో ఈ దోషులకు ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం ఈనెల 22వ తేదీ ఉదయం 7 గంటలు ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. ఇందుకోసం తీహార్ జైలు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిని మీరట్ జైలు తలారి పవన్ గుప్తా ఉరితీయనున్నారు.
ఈనేపథ్యంలో ఈ నలుగురు ముద్దాయిలకు పెడుతున్న ఆహారాన్ని గణనీయంగా తగ్గించారు. అలాగే, ఈ దోషులు జైలులో ఇష్టానుసారంగా, అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వీరికి జైలు అధికారులు శిక్షలు కూడా అమలు చేశారు. ముఖ్యంగా, వినయ్ శర్మ అనుచితంగా ప్రవర్తించినందున 11 సార్లు శిక్షించారు. అలాగే, పవన్ గుప్తా 8 సార్లు, అక్షయ్ కుమార్ 3 సార్లు, ముఖేశ్ సింగ్ ఒకసారి శిక్షకు గురయ్యారని చెప్పారు.
మరోవైపు, ఈ నలుగురు దోషుల్లో ముగ్గురు జైల్లో వివిధ రకాల పనులు చేస్తూ కొన్ని వేల రూపాయలు సంపాదించారు. ముఖేశ్ సింగ్ 69 వేల రూపాయలు సంపాదించగా, వినయ్ శర్మ రూ.39 వేలు, పవన్ గుప్తా రూ.29 వేలు చొప్పున సంపాదించారు. ఈ మొత్తాన్ని ఉరితీత తర్వాత మృతదేహాలను అప్పగించే సమయంలో వారివారి కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్టు జైలు అధికారులు వెల్లడించారు.