దేశంలోనే అరుదైన ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగింది. మేఘన అనే ట్రాన్స్‌జెండర్ వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. చట్టరీత్యా చెల్లుబాటు కానప్పటికీ పెద్దల అంగీకారంతో పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వివాహానికి బంధుమిత్రులు, స్నేహితులతో పాటు నగర మేయర్ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు.
వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్‌కు చెందిన వసుదేవ్ ఇదివరకే ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. కానీ ఇద్దరు పిల్లలు పుట్టాక అతని భార్య ఇంటి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. పిల్లల్ని చూసుకుంటూ కాలం గడుపుతున్న వసుదేవ్‌కు ఫేస్‌బుక్ ద్వారా ట్రాన్స్‌జెండర్ మేఘన పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారు.
మొదట వీరి పెళ్ళికి అభ్యంతరం ఎదురైనా.. చివరికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో శుక్రవారం వేదమంత్రాల నడుమ వీరిద్దరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా మేఘన మాట్లాడుతూ, తనను కోడలిగా స్వీకరించిన వసుదేవ్ కుటుంబానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తానూ తల్లినవుతానని చెప్పుకొచ్చింది.