భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ అన్నెంపున్నెం ఎరుగని శిశువుకు పురుగుల మందు...

బుధవారం, 31 మే 2023 (10:54 IST)
ఒరిస్సా రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ కిరాతక భర్త.. అన్నెంపున్నెం ఎరుగని శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు. ప్రస్తుతం ఆ చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని బాలేశ్వర్‌లో జరిగింది. 
 
దీనిపై జిల్లా ఎస్పీ సాగరిక నాథ్ స్పందిస్తూ, చందన్‌కు తన్మయి అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. వీరికి మే 9వ తేదీన ఆడపిల్ల పుట్టింది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందువల్లే గర్భం దాల్చిందన్న అనుమానంతో చందన్‌ రగిలిపోయాడు. ప్రసవమైన రెండు వారాలకు స్థానిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తన్మయి పుట్టింటికి వెళ్లింది. 
 
భార్యాబిడ్డలను చూసే నెపంతో సోమవారం అక్కడకు చేరుకొన్న చందన్‌.. భార్య మరో గదిలో ఉన్న సమయంలో చిన్నారి శరీరంలోకి సిరంజి ద్వారా పురుగుల మందు ఎక్కించేందుకు ప్రయత్నించాడు. శిశువు ఏడుపు విన్న తన్మయి భర్తను నిలదీయగా బుకాయించాడు. వెంటనే పాపను బాలేశ్వర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సాగరిక నాథ్‌ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు