గవర్నర్లు ప్రజాప్రతిధులు కాదనే విషయం గుర్తెరగాలి : సుప్రీంకోర్టు

మంగళవారం, 7 నవంబరు 2023 (11:35 IST)
గవర్నర్లు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు కాదనే విషయాన్ని గుర్తెరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 
 
గవర్నర్లు తమ పనితీరుపై చిన్నపాటి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. బిల్లుల ఆమోదం వివాదాలు సుప్రీంకోర్టుకు చేరక ముందే వాటిపై నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికింది. పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ చర్యల తాజా పరిస్థితిని వివరిస్తూ నివేదిక సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. 
 
ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం... 'ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం కాదనే వాస్తవాన్ని గవర్నర్లు విస్మరించరాదు' అని హితవు పలికింది. పంజాబ్ ప్రభుత్వం తన ముందుంచిన బిల్లులు అన్నింటిపై గవర్నర్ చర్యలు తీసుకున్నారని, ప్రస్తుత వ్యాజ్యం అవసరంలేదని తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. 
 
'విషయం సుప్రీంకోర్టుకు చేరినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవడానికి ముగింపు పలకాలి' అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను వాయిదా వేసింది. బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం అసెంబ్లీని మళ్లీ సమావేశపర్చడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. మూడు బిల్లుల విషయమై పంజాబ్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం తలెత్తింది. ఆప్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు