దిక్కుతోచని సచిన్ పైలట్.. న్యాయ సలహాల కోసం కాంగ్రెస్ నేతలతో మంతనాలు?

శుక్రవారం, 17 జులై 2020 (12:37 IST)
రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు.. రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవిని కోల్పోయిన తిరుగుబాటు నేత సచిన్ పైలట్ ఇపుడు కాళ్ళబేరానికి వచ్చేలా కనిపిస్తోంది. తనతోపాటు.. తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ జారీచేసిన అనర్హతవేటు నోటీసులు జారీ చేశారు. ఇలా జారీచేయడం విరుద్ధమని పేర్కొంటూ సచిన్ పైలట్ న్యాయపోరాటానికి దిగారు. అయితే, ఎటు చూసినా ఆయన చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోని ఉద్ధండులను సంప్రదిస్తున్నారు. ఇందులోభాగంగా తొలు ప్రముఖ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీని సంప్రదించి న్యాయ సలహా కోరిన పైలట్.. ఆ తర్వాత మరో నేత పి. చిదంబరంకు ఫోన్ చేశారు.
 
ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ స్పందిస్తూ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ మంచోడేనని, కాకపోతే పరిస్థితి ఇక్కడి వరకు రావడమే బాధగా ఉందన్నారు. సచిన్, తాను మంచి స్నేహితులమని, అతడి ప్రతిభను మెచ్చుకునే నేతలు చాలామందే ఉన్నారని అన్నారు.
 
రాజస్థాన్ సంక్షోభం తర్వాత పైలట్ తనకు ఫోన్ చేసి న్యాయ సలహా అడిగారని ఆయన తెలిపారు. అయితే, తాను స్పీకర్ జోషి వైపు ఉన్నానని, సలహా ఇవ్వలేనని చెప్పగా, ఆయన పెద్దగా ఓ నవ్వు నవ్వారని చెప్పారు. 
 
పైగా, ఇద్దరం మంచి స్నేహితులమే అయినప్పటికీ ఈ విషయంలో మాత్రం సలహా ఇవ్వలేనని చెప్పేశానన్నారు. స్వయంగా స్పీకరే నోటీసులు జారీ చేశారు కాబట్టి, ఇలాంటి సమయంలో తానెలా సలహా ఇస్తానని ప్రశ్నించారు.
 
ఆ తర్వాత మరో న్యాయకోవిదుడు పి.చిదంబరంకు ఫోన్ చేసి సలహా అడిగారు. రాజస్థాన్ హైకోర్టులో ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్‍పై శుక్రవారం విచారణ జరుగనున్న నేపథ్యంలో చిదంబరానికి సచిన్ పైలట్ ఫోన్ చేయడం గమనార్హం. 
 
తనను పీసీసీ చీఫ్, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవుల నుంచి తొలగించిన తర్వాత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత సభ్యుడైన చిదంబరంతో మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది.
 
సచిన్ తనతో మాట్లాడిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన చిదంబరం, "కాంగ్రెస్ నాయకత్వం తనని బహిరంగంగా చర్చలకు పిలిచిన విషయాన్ని సచిన్‌కు మళ్లీ చెప్పాను. అక్కడ అన్ని విషయాలను చర్చించవచ్చు, వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అతనికి సలహా ఇచ్చాను" అని అన్నారు. 
 
ఇదిలావుండగా, సచిన్‌ను తిరిగి గౌరవంగా పార్టీలోకి ఆహ్వానించాలని కాంగ్రెస్ భావిస్తోందని, ఎప్పుడు వెనక్కు రావాలన్న విషయాన్ని ఆయనే తేల్చుకోవాల్సి వుందని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు