ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయనీ, అందువల్ల మృతి వెనుక ఉన్న వాస్తవాలను బహిర్గతం చేయాల్సిందేనంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎంకే.స్టాలిన్ డిమాండ్ చేశారు. అలాగే, అక్రమార్జన కేసులో జైలువాసం గడుపుతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు బినామీగా ఉన్న ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, ఆ దిశగా తమ పార్టీ నిర్వహించనున్న ఉద్యమానికి అన్ని వర్గాలవారు మద్దతు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ మన్నార్గుడి మాఫియా చేతుల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని కాపాడేందుకే ఈ నెల 22న డీఎంకే ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలలో నిరాహార దీక్షలు జరుపనున్నామని తెలిపారు. ఈ ఉద్యమానికి విద్యార్థులు, యువకులు, కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అన్ని రాజకీయ పార్టీలవారు సమైక్యంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత తొమ్మిది మాసాలుగా రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిందని, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా పాలనాపరంగాను, అధికార అన్నాడీఎంకే పార్టీలోనూ ప్రజావ్యతిరేక సంఘటనలే కొనసాగుతున్నాయని ఆరోపించారు.
జయ మృతిపై సామాన్య ప్రజల్లోనూ ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాస్తవాలను ఎవరూ వెల్లడించలేకపోతున్నారని, ఆమె మృతికి శశికళే కారణమని అధికార పార్టీ వర్గాలే అనుమానిస్తున్నాయని గుర్తు చేశారు. జయ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగానే అక్రమ పద్ధతిలో అన్నాడీఎంకే శాసనసభ్యుల సమావేశం ఆ పార్టీ కార్యాలయంలో జరిగిందని, పన్నీర్‌సెల్వంను సభాపక్ష నాయకుడిగా ఎంపిక చేసుకున్నారన్నారు. అదే సమయంలో జయ మృతి చెందినట్టు అధికార పార్టీకి చెందిన ప్రసార మాధ్యమంలోనే వార్త వెలువడిందని అందువల్ల జయలలిత మరణం వెనుక ఉన్న వాస్తవాలను వెల్లడించాలన్నారు.