ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు గగనతలంలో మృతి చెందాడు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ విమానం... శుక్రవారం ఉదయం 8.10 గంటలకు లక్నోలోని చరణ్ సింగ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. ప్రయాణికులు విమానం దిగుతున్న సమయంలో సీట్లు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఓ ప్రయాణికుడు వద్దకు వెళ్లగా, అతడిలో ఎలాంటి చలనం లేకపోవడాన్ని గమనించి విమాన సిబ్బందికి సమాచారం చేరవేశాడు. దీంతో విమానంలో ఉన్న వైద్యులు అతడిని పరీక్షించగా మృతి చెందినట్టు ధృవీకరించారు.
సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడిని ఢిల్లీకి చెందిన ఆసఫ్ ఉల్హా అన్సారీగా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. విమానం ఎక్కిన తర్వాత అతడికి ఇచ్చిన ఆహార పదార్థాలు అలానే ఉండటం, సీటు బెల్టు కూడా తీయకపోవడంతో గాల్లో ఉన్న సమయంలో మృతి ేచెందివుంటాడని అనుమానిస్తున్నారు. అతడు మృతి చెందడానికి గల కారణాలు తెలియరాలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని తెలిపారు. అతడి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం చేరవేశారు.