గత యేడాది కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా దుర్మరణం చెందారు. అయితే, ఈ విమానం కుప్పకూలడానికి పైలట్ తప్పిదమే కారణమని తేల్చారు. పైలట్ తప్పిదంతోపాటు క్రమబద్ధమైన వైఫల్యం అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని తాజాగా వెల్లడైన నివేదిక పేర్కొంది.
గత ఏడాది ఆగస్టు 7వ తేదీన కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737-800 కుప్పకూలిపోయిన విషయం తెల్సిందే. ఈ విమానం దుబాయ్ నుంచి వచ్చింది. ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి జారిపడి లోతైన వాగులో పడిపోయింది. విమానంలో 190 మంది ప్రయాణికులు ఉండగా.. వీరిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు.
ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఒక నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం, ఎస్‌ఓపీని విస్మరించి పైలట్ విమానాన్ని నడిపించాడు. టచ్‌డౌన్ పాయింట్ తర్వాత విమానాన్ని ల్యాండ్ చేశాడు. సగం రన్‌వే దాటిన తర్వాత పైలట్ ల్యాండింగ్ చేశాడు. ఈ సమయంలో ఫ్లైట్‌ను కంట్రోల్ చేయలేకపోయాడు. దాంతో విమానం కుప్పకూలింది.