భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (డీఆర్‌డీవో) మిషన్ శక్తి పేరుతో ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏ-శాట్)ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల సరసన భారత్ చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మిషన్ శక్తి'తో భారత్ కొత్త చరిత్ర లిఖించిందన్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్) ప్రయోగంతో అంతరిక్షంలోనూ తిరుగులేని శక్తిగా అవతరించిందని చెప్పారు. ఆ క్షిపణి కేవలం మూడు నిమిషాల్లో దిగువ కక్ష్యలోని ఓ ఉపగ్రహాన్ని కూల్చివేసిందని వెల్లడించారు. ఈ విజయంతో అంతరిక్ష సామర్థ్యంలో అమెరికా, రష్యా, భారత్, చైనా సరసన నిలిచామని వెల్లడించారు.
'భూమి, నీరు, గాలిలోనే కాదు ఇప్పుడు అంతరిక్షంలోనూ మనను మనం రక్షించుకోగలం. ఇది మనమంతా గర్వించాల్సిన క్షణం' అన్నారు. ఏ-శాట్ ఏ దేశానికీ వ్యతిరేకం కాదని, ఆత్మరక్షణకు మాత్రమేనని తెలిపారు. ఏశాట్ ప్రయోగం అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలను ఉల్లంఘించదని స్పష్టం చేశారు. భారత్ ఎలాంటి లక్ష్యాలనైనా సాధించగలదని మరోమారు నిరూపించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.