దేశంలో నల్లధనం లేకుండా, అవినీతిని పూర్తిగా రూపుమాపే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా.. నల్లధనం సమూలంగా రూపుమాపాలనే ఉద్దేశంలో ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది.
ఇందులో తాము తీసుకురావాలనుకుంటున్న ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. త్వరలోనే ఈ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన నోట్లు కలిగి ఉంటే నేరంగా పరిగణించి చర్యలు తీసుకోనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత పాతనోట్లు కలిగి ఉండి పట్టుబడితే నాలుగేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. అలాగే పాత నోట్లతో లావాదేవీలు జరిపితే రూ.5 వేల జరిమానా విధించనున్నారు.
అలాగే, రద్దయిన పెద్దనోట్లను ఈ నెల 30 తర్వాత రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారానే మార్చుకోవాలని, అందుకోసం కేవైసీ ఫారాలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. పాతనోట్లు జమ చేసుకోవాలంటే అధికారులు అడిగిన ప్రశ్నలకి ప్రజలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాగా, నగదురహిత లావాదేవీలతో కాకుండా నగదుతో మాత్రమే వ్యాపారాలు చేసే వారిపై కూడా పలు ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది.