ప్రజ్వల్ రేవణ్ణ ఒక మాస్ రేపిస్ట్.. రాహుల్ ఆరోపణల : ఏకంగా 400 మంది మహిళలపై..

ఠాగూర్

గురువారం, 2 మే 2024 (17:02 IST)
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, హాసన నియోజకవర్గ ఎన్డీయే లోక్‌సభ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజ్వల్ ఏకంగా 400  మంది మహిళలపై దౌర్జన్యంతో అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, వారిని వీడియోలు కూడా తీశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఓట్లు వేయాలని కోరిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. దేశ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, శివమొగ్గలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రజ్వల్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 
 
'ప్రజ్వల్‌ రేవణ్ణ 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడి, వారి వీడియోలు చిత్రీకరించాడు. ఇది సెక్స్‌ కుంభకోణం కాదు. ఇది అతిపెద్ద అత్యాచార ఘటన. ఓట్ల గురించి వాళ్లు (భాజపా కూటమి) అడుగుతున్నప్పుడు ప్రజ్వల్‌ ఏం చేశాడో ప్రతీ మహిళ తెలుసుకోవాలి. అతడి గురించి ప్రధానికి ముందే తెలుసు. అటువంటి వ్యక్తికి కర్ణాటక వేదికగా మోడీ మద్దతు పలికారు' అని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.
 
ప్రజ్వల్‌ ఒక మాస్‌ రేపిస్ట్‌ అని బీజేపీకి చెందిన ప్రతి ఒక్క నేతకు తెలుసునని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అయినప్పటికీ అతడికి మద్దతు పలకడమే కాకుండా అతడి పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. అటువంటి వ్యక్తికి ప్రచారం చేసినందుకు గాను దేశంలో ప్రతీ మహిళకు ప్రధాని మోడీ, అమిత్‌ షా సహా భాజపా నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 
చిక్కుల్లో ప్రజ్వల్ రేవణ్ణ - లుకౌట్ నోటీసులు జారీ చేసిన సిట్ 
 
ఇప్పటికే మహిళపై అత్యాచారం, వీడియో కేసుల్లో చిక్కుకుని జర్మనీకి పారిపోయిన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు మున్ముందు మరిన్ని చిక్కులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఆయనపై నమోదైన దౌర్జన్యం కేసులో కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం లుకౌట్ నోటీసులు జారీచేసింది. ఈ కేసులో విచారణకు హాజరవ్వాలని ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి రేవణ్ణలకు నోటీసులు జారీ చేసింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్‌ కోరారు. ఇందుకు తిరస్కరించిన సిట్‌ గురువారం ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసింది.
 
హాసన సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ప్రజ్వల్‌ రేవణ్ణ.. ఈ కేసు వెలుగులోకి రాగానే దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ కేసుపై నిన్న తొలిసారిగా సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. విచారణకు హాజరయ్యేందుకు వారం రోజులు గడువు కావాలని కోరారు. వాస్తవాలు త్వరలోనే బయటపడతాయన్నారు. ఆయన అభ్యర్థనను సిట్‌ తిరస్కరించింది. ఈ క్రమంలోనే లుక్‌అవుట్‌ నోటీసు ఇచ్చింది. దీంతో ప్రజ్వల్‌ దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలు ఉంటుంది. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, విచారణకు సహకరిస్తానని తండ్రి హెచ్‌డీ రేవణ్ణ ఇప్పటికే వెల్లడించారు.
 
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో దేవేగౌడ పార్టీ జేడీఎస్.. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుంది. దీంతో ప్రజ్వల్ హాసన నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి రావడంతో పాటు బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రజ్వల్‌, ఆయన తండ్రిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు