కలవరపెడుతున్న కరోనా బీఎఫ్7 వేరియంట్.. నేడు ఉన్నతస్థాయి సమీక్ష

గురువారం, 22 డిశెంబరు 2022 (11:21 IST)
పలు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్ బీఎఫ్ 7 కలవరపెడుతోంది. ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. గుజరాత్ రాష్ట్రంలో రెండు, ఒరిస్సాలో ఒకటి చొప్పున ఈ కొత్త రకం వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వేరియంట్ చైనాలో అల్లకల్లోలం చేస్తుంది. భారత్‌నూ అడుగుపెట్టడంతో కేంద్రం అప్రమత్తమైంది. 
 
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. కోవిడ్ తాజా పరిస్థితులపై ఆయన గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 
 
మరోవైపు, దేశంలోకి కొత్త వేరియంట్లు ప్రవేశిస్తుండటం, పండుగల సీజన్ కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కోరింది. చైనా సహా కరోనా అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కోవిడ్ ర్యాండమ్ పరీక్షలు నిర్వహించాలని కోరింది. 
 
అదేసమయంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మాండవీయ వెల్లడించారు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒక్క కరోనా మరణం నమోదైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3408 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు