చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ.. అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరిన సంగతి తెలిసిందే. అయితే, వీటి రాకతో చైనా ఆందోళనకు గురికావడం నిజమేనని భారత వైమానిక దళాధిపతి స్పష్టం చేశారు. చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొన్న కారణంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఐఏఎఫ్ చీఫ్ పేర్కొన్నారు.
'ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల సైనికాధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. చర్చలు ఫలప్రదమౌతాయనే అశిస్తున్నాం. కానీ, ఒకవేళ కొత్త పరిస్థితులు ఎదురైతే మాత్రం వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు అవసరమైనన్ని బలగాలను రంగంలోకి దించాం' అని భారత వైమానిక దళాధిపతి ఆర్‌కేఎస్ భదౌరియా ఓ వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.
ఇక ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ రఫేల్ యుద్ధవిమానాల సంఖ్య భారత్‌లో 11కి చేరింది. మొత్తం 36 రఫేల్ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దఫాలో ఐదు, తర్వాత మూడు, మరో దఫాలో మూడు చేరుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 11 రఫేల్ విమానాలను భారత్‌కు అందించింది.