విధిని నమ్ముతాను.. నా పెళ్లి విధిరాత : రాహుల్

శుక్రవారం, 27 అక్టోబరు 2017 (08:43 IST)
తాను విధిని నమ్ముతానని, ఇక నా పెళ్లి అంటారా.. అది విధిరాత అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన చాంబర్ ఆఫ్ కామర్స్ 112వ వార్షిక సదస్సుకి హాజరైన రాహుల్ మాట్లాడుతూ వ్యక్తిగత జీవితానికి చెందిన పలు విషయాలను బయటపెట్టారు. ఇదే కార్యక్రమానికి హాజరైన బాక్సర్ విజేందర్ లేచి ‘రాహుల్.. మీ వివాహం ఎప్పుడు?’’ అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
అది అంతా ‘విధిరాత’ అని వ్యాఖ్యానించారు. తాను విధిని నమ్ముతానని, ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుందన్నారు. అలాగే విజేందర్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా తాను జపాన్ మార్షల్ ఆర్ట్స్‌కు చెందిన అకిడో విద్యలో నిష్ణాతుడినని చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి ఎవరికీ తెలియదని, వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం తనకు ఇష్టం ఉండదన్నారు. అకిడో విద్యలో ప్రావీణ్యం ఉందని రాహుల్ చెప్పగానే సభికులు ఆశ్చర్యపోయారు. 
 
ఇకపోతే.. ప్రస్తుతం కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వంపై నమ్మకం చచ్చిపోయింది. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ దొంగేనని ప్రధాని ఎందుకో నమ్ముతున్నారు. ప్రభుత్వం కూడా నమ్ముతోంది. దేశంలో డబ్బంతా నల్లధనం కాదు. పెద్ద ఛాతీ.. చిన్నహృదయంతో పీఎం తన అధికారాలను ప్రజలపై ప్రయోగిస్తున్నారు. అని రాహుల్‌ పేర్కొన్నారు. మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘స్టార్టప్‌ ఇండియా’ను ప్రస్తావించి.. ‘‘ఆ కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిదే. కానీ, దాంతోపాటే ‘షటప్‌ ఇండియా’ అమలు కావడం సరికాదు.’’ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు