కింగ్ కాంగ్ : బాధ్యతలు స్వీకరించిన రాహుల్

శనివారం, 16 డిశెంబరు 2017 (11:36 IST)
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ శకం ఆరంభమైంది. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ప్రెసిడెంట్ ముళ్ళపల్లి రామచంద్రన్ నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.
 
ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ హాజరయ్యారు. రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వద్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 19 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన సోనియా.. శనివారం తన బాధ్యతలను రాహుల్‌కు అధికారికంగా అప్పగించారు.
 
కాగా, ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. గాంధీ-నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆరో వ్యక్తి రాహుల్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. కార్యాలయ ప్రాంగణం రాహుల్ చిత్రపటాలతో నిండిపోయింది.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రఘువీరారెడ్డి, జేడీ శీలం, పల్లం రాజు హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు