రామాలయం అంశాన్ని అడ్డుపెట్టుకుని భారతీయ జనతా పార్టీతో పాటు ఎంఐఎంలు దేశంలో మతకలహాలను సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే ఆరోపించారు. ముంబైలోని విఖ్రోలిలో జరిగిన ఆ పార్టీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మాట్లాడేందుకు ఒక్క అంశం కూడా లేదన్నారు. అందుకే మత అంశాలను తెరపైకి తెచ్చి, హిందూ - ముస్లిం ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు.
అయోధ్యలోని రామాలయం నిర్మాణం విషయంలో మజ్లిస్ పార్టీ, బీజేపీలు దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రపన్నుతున్నాయన్నారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తాను కోరుతున్నాననీ, అదేసమయంలో నిర్మాణం విషయంలో అంత కఠినంగా వ్యవహరించబోనని చెప్పారు.
ఇటీవల హనుమంతుడిని దళితుడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను రాజ్‌థాకరే ఖండించారు. యూపీ, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికికాకుండా మహారాష్ట్రలోని స్థానికులకు ఉద్యోగాశాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని రాజ్‌థాకరే డిమాండ్ చేశారు. వలస వచ్చిన వారి వల్ల మహారాష్ట్రలో స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని రాజ్ థాక్రే ఆరోపించారు.