రాతపరీక్ష కోసం రాష్ట్రమంతా ఇంటర్నెట్‌ సేవలు బంద్‌.. ఎక్కడ?

సోమవారం, 16 జులై 2018 (16:00 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఒక్క రోజంతా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా బంద్ చేశారు. శని, ఆదివారాల్లో కానిస్టేబుళ్ల నియామకం కోసం రాత పరీక్షలు నిర్వహించారు. ఆన్‌లైన్‌ ద్వారా జరిగే హైటెక్‌ మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
రాజస్థాన్‌లో ఈ ఏడాదిలో రెండోసారి కానిస్టేబుళ్ల నియామకం కోసం‌ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. గతంలో మార్చిలో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించారు. అయితే టెక్నాలజీ సాయంతో కొందరు మోసాలకు పాల్పడినట్లు ప్రత్యేక పోలీసుల బృందం కనిపెట్టడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. దీంతో శని, ఆదివారాల్లో మళ్లీ పరీక్ష నిర్వహించారు. 
 
సుమారు 13,000 కానిస్టేబుల్‌ పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్నెట్‌ సేవలు ఆపేశారు. దాదాపు అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 
 
సాధారణంగా శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు వదంతులు వ్యాపించకుండా ఇంటర్నెట్‌ సేవలను నిలిపేస్తారు.. కానీ తొలిసారిగా పరీక్షల్లో చీటింగ్‌ను అరికట్టేందుకు నిలిపేశారని ఓ అధికారి వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్‌ ద్వారా అటెండెన్స్‌ రికార్డు చేశారు. 13,143 కానిస్టేబుల్‌ పోస్టులకు దాదాపు 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 
 
కాగా, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడంతో ఆన్‌లైన్‌ లావాదేవీలు, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్స్‌‌పై ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పూర్తిగా సేవలు నిలిపివేసే బదులు పరీక్ష కేంద్రాల వద్ద ఇంటర్నెట్‌ జామర్లు ఏర్పాటు చేస్తే సరిపోయేదని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు