మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం చేజారిపోతుందనే విషయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే కలత చెందిన మాట వాస్తవమేనని, అయినప్పటికీ సీఎం పదవిని ఆయనకు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి రాందాస్ అథావాలే అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి 230 సీట్లను గెలుచుకోగా వాటిలో బీజేపీకి 132, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి. ఈ కూటమికి బంపర్ మెజారిటీ వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది.
ముఖ్యమంత్రి పదవి కోసం ఏక్‌నాథ్ షిండే పట్టుబట్టగా, కమలనాథులు మాత్రం దేవేంద్ర ఫడ్నవిస్‌ను చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. దీంతో ఏక్‌నాథ్ షిండే అలకపాన్పునెక్కారు. దీనిపై కేంద్ర మంత్రి రాందాస్ అథావాలే స్పందించారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముందు మూడు దారులు ఉన్నాయన్నారు.
ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం లేదా మహాయుతి కూటమి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం లేదా కేంద్ర ప్రభుత్వంలో స్థానం కోరుకోవడం... ఈ మూడింటిలో ఏదో ఒకటి ఆయన ఎంచుకోవాలన్నారు. ఈసారి బీజేపీయే ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటుందని అథవాలే స్పష్టం చేశారు. ఆపద్ధర్మ సీఎంగా ఉన్న షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశముందన్నారు.