కరోనాతో కోలుకున్న వారంతా టీబీ పరీక్షలు చేయించుకోవాలి : కేంద్ర ప్రభుత్వం

సోమవారం, 19 జులై 2021 (10:05 IST)
దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ సందర్భంలోనే కరోనాలోని పలు వేరియంట్లు భయాందోళనకు గురి చేస్తున్నాయి. వీటితో థర్డ్ వేవ్ ప్రమాదం కూడా పొంచి ఉంటుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
 
ఈ తరుణంలోనే పెరుగుతున్న క్షయ (టీబీ) కేసుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన కోలుకున్న వారికి టీబీ సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో క్షయ (టీబీ) కేసులు పెరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు శనివారం కీలక ప్రకటన చేసింది.
 
మహమ్మారి బారినపడి కోలుకున్న వారంతా తప్పనిసరిగా టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో పాటు టీబీ వ్యాధిగ్రస్థులు సైతం కరోనా పరీక్షలు చేయించు కోవాలని సూచించింది. ఈ విషయంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దృష్టి సారించాలని.. టీబీ పరీక్షలను పెంచాలంటూ స్పష్టంచేసింది.
 
కాగా.. కరోనా నుంచి కోలుకున్న రోగులు క్షయ వ్యాధి (టీబీ) బారిన పడుతున్నారన్న వార్తలను కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. టీబీ కేసుల పెరుగుదలకు.. కరోనా కారణం అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే.. కోవిడ్‌-19 మహమ్మారి వలన క్షయ, బ్లాక్‌ ఫంగస్‌ వృద్ధి చెందవచ్చని.. ఇది అవకాశం మాత్రమేనంటూ వెల్లడించింది.

ఈ రెండు అంటువ్యాధులు ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తాయని దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను సృష్టిస్తాయంటూ తెలిపింది. టీబీ, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులు ప్రధానంగా బలహీన వ్యక్తులపైనే దాడి చేస్తాయని.. కావున కరోనా నుంచి కోలుకున్న వారు తమ ఇమ్యూనిటీని పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు